డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసుపై సీబీఐ విచారణ: తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు
అమరావతి:డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు.2022 మే 19వ తేదీన అనుమానాస్పదస్థితిలో డ్రైవర్ సుబ్రమణ్యం మృతి చెందాడు. ఈ డెడ్ బాడీని ఎమ్మెల్సీ అనంతబాబు వారి ఇంటి వద్ద కారులో తీసుకెళ్లి వదిలాడు. ఎమ్మెల్సీ అనంతబాబే డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేశాడని పేరేంట్స్, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ కేసులో అనంతబాబును 2022 మే 23న పోలీసులు అరెస్ట్ చేశారు.డ్రైవర్ సుబ్రమణ్యానిది హత్యేనని పోస్టుమార్టం నివేదిక కూడ తేల్చిందని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు.ఈ కేసులో అరెస్టైన అనంత బాబు బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ హత్య కేసును స్థానిక పోలీసుల విచారణపై డ్రైవర్ సుబ్రమణ్యం పేరేంట్స్ మొదటి నుండి అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్సీకి అనుకూంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు గతంలో ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఏపీ హైకోర్టులో డ్రైవర్ సుబ్రమణ్యం పేరేంట్స్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు బుధవారంనాడు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదికి హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. సీసీపుటేజీలో ఉన్న వారిని నిందితులుగా ఎందుకు చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం అనంతబాబునే ఎందుకు నిందితులుగా చేర్చారని హైకోర్టు అడిగింది.
also read:డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు : సీబీఐకిఅప్పగింతపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈ కేసును లోతుగా విచారించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కేసు వివరాలను ప్రభుత్వం సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించింది. ఇరు వర్గాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఇవాళ ప్రకటించింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ను అరెస్ట్ చేయడంతో ఆయనను వైఎస్ఆర్‌సీపీ నుండి ఆ పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.