అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. తనపై పెట్టిన కేసులకు సంబంధించి ముదస్తు బెయిల్ కోసం విజయలక్ష్మి దాఖలు చేసిన నాలుగు పిటీషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. 

గుంటూరు జిల్లా నరసరావుపేట టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో విజయలక్ష్మిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ స్పీకర్ గా పనిచేస్తున్నప్పుడు నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ విజయలక్ష్మిపై ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో తనపై నమోదు చేసిన నాలుగు కేసులు అక్రమమంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ కోరారు. విజయలక్ష్మి పిటీషన్లపై విచారణ చేపట్టని న్యాయమూర్తి డీవీవీ సోమయాజులు ముందస్తు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చారు. 

దీంతో విజయలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇకపోతే విజయలక్ష్మితోపాటు ఆమె సోదరుడు కోడెల శివరామ్ సైతం ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శివరామ్ పై సైతం ఇప్పటి వరకు 10కిపైగా కేసులు నమోదు అయ్యాయి.