హైకోర్టుకు శాశ్వత భవనం తదితర అంశాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు శాశ్వత భవనం, ఉద్యోగులకు క్వార్టర్లు, నిర్మాణం చేపట్టాలని దాఖలైన పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై విస్తృత ధర్మాసనం వద్ద విచారణ పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రస్తుత వ్యాజ్యాన్ని కూడా వాటితో పాటు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై విచారణను రాష్ట్ర హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. గురువారం జరిగిన విచారణలో భాగంగా... మద్యం అమ్మకాల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉన్నందున తీర్పు వచ్చే వరకు విచారణ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీనిని పరిగణనలోనికి  తీసుకున్న ఉన్నత న్యాయస్థానం 19 వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు  ప్రకటించింది.

Also read:మద్యం అమ్మకాలపై పిటిషన్.... విచారణను మంగళవారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

కాగా ఏపీలో కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో మద్యం అమ్మకాలను జరపడంపై మాతృభూమి ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. కోవిడ్ 19 కారణంగా మద్యం అమ్ముతూ క్యూలలో భౌతిక దూరం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మద్యం సేవించడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.

సంపూర్ణ మద్యనిషేధం ప్రభుత్వ విధానం అయినప్పుడు.. అందుకు అవకాశం వచ్చినప్పుడు దీనిని అమలు చేయవచ్చు కదా అని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మే 11న జరిగిన విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.