రాష్ట్రపతి పర్యటనకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్: రేణిగుంటకు బయలుదేరిన మంత్రి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు ఆదివారంనాడు అనుమతిని ఇచ్చింది.
చిత్తూరు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటనలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు ఆదివారంనాడు అనుమతిని ఇచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుండి బయటకు రావొద్దని ఎస్ఈసీ ఆదేశించింది.ఈ ఆదేశాలను పాటిస్తానని మంత్రి శనివారం నాడు సాయంత్రం ప్రకటించారు.
అదే సమయంలో ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తే ఏపీ హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ ఉదయం నుండి విచారణ సాగుతోంది. ఇవాళే జిల్లాలో రాష్ట్రపతి పర్యటన ఉన్నందున ప్రోటోకాల్ ప్రకారంగా ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొనాల్సి ఉంది.
ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రపతి టూర్ లో పాల్గొనేందుకు మంత్రికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు గాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటి నుండి బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం చెప్పేందుకు మంత్రి వెళ్లనున్నారు.
మరో వైపు ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. కానీ ఈ విషయమై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు తీర్పును వెల్లడించనుంది.