అమరావతి: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం ఘటనపై ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ నిర్వహించిన డాక్టర్ రమేష్ ను  విచారించేందుకు  పాటు కస్టడీకి పోలీసులకు ఏపీ హైకోర్టు అనుమతించింది. న్యాయవాది సమక్షంలోనే డాక్టర్ రమేష్ ను విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు డాక్టర్ రమేష్ ను విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ ఏడాది ఆగష్టు 9వ తేదీన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొందని అప్పట్లో నిర్ధారించారు.

ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. కోవిడ్ సెంటర్ల అనుమతుల విషయమై ఏపీ ప్రభుత్వం లోతుగా విచారణ చేసింది. సరైన సౌకర్యాలు లేకుండానే చాలా చోట్ల కోవిడ్ సెంటర్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తించారు. సౌకర్యాలు లేని కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేసిన విషయం తెలిసిందే.