మూడు వారాల్లో రాజధాని రైతులకువార్షిక కౌలు చెల్లించాలి: ఏపీ హైకోర్టు ఆదేశం
రాజధాని రైతులకు వార్షిక కౌలును మూడు వారాల్లోపుగా చెల్లించాలని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.
హైదరాబాద్: రాజధాని రైతులకు వార్షిక కౌలును మూడు వారాల్లోపుగా చెల్లించాలని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది.రాజధాని రైుతలకు వార్షిక కౌలు చెల్లింపులపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ సాగింది. ప్రతి ఏటా రైతులకు వార్షిక కౌలు చెల్లింపు విషయంలో ఎందుకు ఆలస్యం అవుతోందో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎప్పటిలోపుగా రైతులకు కౌలు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే తమకు నాలుగు వారాల సమయం కావాలని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కేవలం మూడు వారాల్లో మాత్రమే రైతులకు కౌలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం మేరకు ప్రభుత్వాలు భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం రాజధాని రైతులు కౌలు కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాదిలో కూడ కౌలు చెల్లింపు విషయంలో ఆలస్యమైన విషయాన్ని రైతులు ఆ పిటిషన్ లో గుర్తు చేశారు.