పాదయాత్రలో 600 మంది కంటే ఎక్కువ పాల్గొనవద్దు:ఏపీ హైకోర్టు ఆదేశం
అమరావతి పాదయాత్రలో 600 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. గుర్తింపు కార్డులున్నవారే యాత్రలో పాల్గొనాలని సూచించింది. అంతేకాదు పాదయాత్రను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ చేయనుంది.
అమరావతి:అమరావతి పాదయాత్రలో 600 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రకు మదతిచ్చేవారంతా రోడ్డుకు ఇరువైపులా ఉండాలని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి నుండి అరసవెల్లి వరకు రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారనే దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది.ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయ మై ఇరు వర్గాల వాదనలను హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేవారు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని సూచించింది. పాదయాత్రలో నాలుగు వాహనాలకు మాత్రమే హైకోర్టు అనుమతిని ఇచ్చింది.పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడాలని హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది.
మరో వైపు పాదయాత్రను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇవాళ మధ్యంతర పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనలపై దాఖలైన పిటిసన్లను కూడా కలిపి వింటామని ఏపీ హైకోర్టు ప్రకటించింది.
2019 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్నితెరమీదికి తెచ్చింది. 2014లో అమరావతిలో రాజధానికి వైసీపీ సమ్మతించిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. మూడు రాజధానులను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతున్నారు
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు విపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు అమరావతి నుండి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతుంది .
అయితే మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ రౌండ్ టేబుల్స్ నిర్వహించింది. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనకు వైసీపీ మద్దతును ప్రకటించింది. మూడు రాజధానులకు మద్దతుగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని వైసీపీ నిర్వహిస్తుంది.