Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసు.. సీబీఐ విచారణకు ఆదేశించిన ఏపీ హైకోర్టు..

నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో ఫైళ్ల చోరీపై ఘటనను సుమోటోగా తీసుకుని విచారించిన హైకోర్టు.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.

Ap High court orders cbi inquiry in nellore court file missing case
Author
First Published Nov 24, 2022, 11:14 AM IST

నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో ఫైళ్ల చోరీపై ఘటనను సుమోటోగా తీసుకుని విచారించిన హైకోర్టు.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈ ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరు కోర్టులో చోరీ జరగడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. చోరీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నెల్లూరు కోర్టు హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలోనే కోర్టులో చోరీ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ హైకోర్టు.. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

నెల్లూరులోని నాల్గొవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తాళాలను పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ప్రజాప్రతినిధికి చెందిన కేసుకు సంబంధించి పత్రాలను, ఇతర పరికారాలను దొంగిలించారని కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగింది.

అసలు వివాదం విషయానికి వస్తే.. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios