టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుకి హైకోర్టులో ఊరట: అరెస్ట్ చేయొద్దని ఆదేశం
టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు ఆదేశించింది.
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు ఆదేశించింది.
చిత్తూరు జిల్లా యాదమర్రి పోలీస్ స్టేషన్ లో దొరబాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. గత ఆదివారం నాడు స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది.
ఇరువర్గాలు పరస్పరం కేసులు నమోదు చేసుకొన్నాయి. ఎమ్మెల్సీ దొరబాబు తమను కారుతో ఢీకొట్టారని వైఎస్ఆర్ సీపీ వర్గీయులు కేసు పెట్టారు. తన కారుపై వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయవద్దని కోరుతూ ఎమ్మెల్సీ దొరబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ దొరబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అప్పటివరకు దొరబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.