అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిని తరలించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వేల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు తరలిస్తామనడం ప్రభుత్వం మతిలేని చర్య కాదా అని హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిపివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ నిధులన్నీ ప్రజలవని, పనులు నిలిపేయడంతో చివరగా వ్యధకు గురయ్యేది ప్రజలేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని ప్రాంతంలో భవనాలు నిర్మించి ఎక్కడి వాటిని అక్కడే  వదిలేశారని విమర్శించింది. ఇప్పటి వరకు ఖర్చు చేసిన డబ్బు ప్రజలకు, ప్రభుత్వానికి జరిగిన నష్టమా, కాదా అని ప్రశ్నిచంింది. 

రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పిటిషనర్ తన అఫిడవిట్ లో ప్రస్తుత ప్రభుత్వం మతిలేని చర్య అని అంటే తప్పేమిటని హైకోర్టు ప్రత్యేక సీనియర్ కౌన్సెల్ ఎస్. ఎస్. ప్రసాద్ ను అడిగింది. తమ భూముల నుంచి ఖాళీ చేయకుండా రెవెన్యూ అధికారులను నిలువరించాలని కోరుతూ దాఖలైన పలు పటిషన్లలో చట్టపరమైన నిబంధనలను అనుసరించాలని తాము ఆదేశించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. 

నిబంధనలను పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించడం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన మతిలేని చర్య కాదా అని అడిగింది. పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుని వ్యక్తులను కోర్టులో హాజరు పరిచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరుపుతున్న సమయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పు పట్టింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

ప్రజా చైతన్య యాత్రకు పోలీసుల అనుమతితో విశాఖ వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి పోలీసులు అరెస్టు చేయడాన్ని, ప్రతిపక్షాలు చేపట్టే ర్యాలీలను, సమావేశాలను పోలీసులు అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాకలు చేసిన పిల్ మీద శుక్రవారం విచారణ జరిగింది. 

పోలీసుల తరఫున సీనియర్ కౌన్సెల్ వాదనలు వినిపించారు. ప్రస్తుత ప్రభుత్వ మతిలేని చర్యపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు యాత్ర చేపట్టారని పిటిషన్ లో పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రాజదాని అమరావతిలో పనులు నిలిపేయడానని గుర్తు చేసిన హైకోర్టు అది ప్రభుత్వ మతిలేని చర్య కాదా ప్రశ్నించింది.