టీటీడీ బోర్డులో నేర చరితులు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి సభ్యులలో కొందరికి నేర చరిత్ర వుందంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఈ ముగ్గురికి వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చింది.

టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా నేర చరితులకు అవకాశం కల్పించారంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ బుధవారం విచారణ జరిపింది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డిలకు పర్సనల్ నోటీసులు జారీ చేసింది. వీరి నియమకాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ దాఖలు చేశారు.
నేర చరిత్ర వున్నవారిని, అనర్హులను, మంచి నడవడిక లేనివారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని వెంకటేశ్వర్లు తరపున న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావుల ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. అయితే శిక్షపడని కారణంగా వారిని నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: టీటీడీ పాలకమండలిలో నేర చరిత్ర వున్న వారు.. ఏపీ హైకోర్ట్ ఫైర్, కీలక ఆదేశాలు
ఇదిలావుండగా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వం నుంచి తొలగించబడిన కేతన్ దేశాయ్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు వున్నాయని పిటిషనర్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను మూడు వారాలు వాయిదా వేసింది.