సారాంశం
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి సభ్యులలో కొందరికి నేర చరిత్ర వుందంటూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. దేవాదాయ శాఖ కమీషనర్, టీటీడీ ఈవోలకు నోటీసులు జారీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డును ఇటీవల ఏపీ ప్రభుత్వ నియమించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త పాలకమండలిలోని సభ్యులలో కొందరికి నేర చరిత్ర వుందంటూ విపక్షాలు ఫైర్ అయ్యాయి. దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరిత్ర వున్న సభ్యులు వుండటంపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాలకు వ్యతిరేకంగా శరత్ చంద్రారెడ్డి, డాక్టర్ కేతన్, సామినేని ఉదయభాను వంటి నేర చరిత్ర వున్న వ్యక్తులు టీటీడీ బోర్డులో స్థానం పొందడం నిబంధనలకు విరుద్ధమని విజయవాడకు చెందిన చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా వున్న శరత్ చంద్రారెడ్డి, సామినేని ఉదయభాను, డాక్టర్ కేతన్‌లపై తీవ్ర నేరాభియోగాలు వున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: ఛైర్మన్‌గా క్రైస్తవుడు, స్కామ్‌లో దొంగలు సభ్యులు.. టీటీడీ పాలకమండలిపై అచ్చెన్నాయుడు విమర్శలు
పవిత్రమైన తిరుమలలో ఇలాంటి వారు వుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఆకుల శేషసాయి, జస్టిస్ రఘునందన్ రావుల ధర్మాసనం .. దేవాదాయ శాఖ కమీషనర్, టీటీడీ ఈవోలకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.