ఏపీలో కరోనా కేసులు: హైకోర్టు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో రెమిడెసివర్, ఇతర అత్యవసర మందులపై ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో రెమిడెసివర్, ఇతర అత్యవసర మందులపై ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తోట సురేష్, ఏపీ పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు బుధవారం నాడు విచారణ నిర్వహించింది. రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. రాష్ట్రంలో ఐసోలేషన్ కేంద్రాలను పెంచాలని కోరింది.
ఆసుపత్రుల్లో అందుతున్న చికిత్స, ఫీజుల వసూలు, ఇతర అంశాలపై హైకోర్టు ప్రభుత్వం నుండి వివరాలు అడిగి తెలుసుకొంది. కరోనా కేసుల విషయమై వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నోటిఫై చేసిన ఆసుపత్రుల్లో నోడల్ అధికారిని నియమించాలని హైకోర్టు సూచించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్య, ఫీజు వివరాలను ప్రదర్శించాలని హైకోర్టు కోరింది.కోవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాలు అవకాశం ఉన్నంతవరకు త్వరగా తెలిపాలని కోర్టు ఆదేశించింది. సుమారుగా రెండు గంటల పాటు ఈ విషయమై హైకోర్టులో వాదనలు జరిగాయి.