ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కారుకు ప్రమాదం.. జస్టిస్ సుజాత తలకు తీవ్రగాయాలు
ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ వడ్జిబోయిన సుజాత ప్రయాణిస్తున్న కారు వర్షం కారణంగా ప్రమాదానికి గురైంది. కారుబోల్తా పడడంతో ఆమె తీవ్రగాయాలపాలయ్యారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వడ్డిబోయిన సుజాత ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడడంతో జస్టిస్ సుజాత తీవ్రగాయాల పాలయ్యారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతుండగా సూర్యాపేట-కోదాడ మధ్య గుంపుల దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. జస్టిస్ సుజాత కారు ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని తిరుమలగిరి శివారులో నేషనల్ హైవే 65పై ప్రమాదానికి గురైంది.
వర్షం కారణంగా కారు టైర్లు జారడంతో.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జస్టిస్ సుజాత తలకు తీవ్రగాయాలయ్యాయి. బండి నడుపుతున్న డ్రైవర్, గన్ మెన్ లకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమాచారం తెలియడంతో పోలీసులు పుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో నుంచి గాయపడిన సుజాతను బయటికి తీసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చంద్రబాబు అరెస్టును ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురైన అచ్చెన్నాయుడు
వెంటనే ఆమెకు వైద్య చికిత్స మొదలుపెట్టిన వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. జస్టిస్ సుజాతకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాదుకు తరలించాలని సిఫార్సు చేశారు. దీంతో తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా తన కాన్వాయ్ లో జస్టిస్ సుజాతని హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జాతీయ రహదారి పొడుగున జగదీశ్ రెడ్డి కాన్వాయ్ కి అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.