కాకినాడ: 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. అంతేకాదు చాలామంది అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. 

అయితే జనసేన పార్టీ పరువు నిలబెట్టారు రాపాక వరప్రసాదరావు. జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అయితే ఎన్నికల్లో గెలిచిన రాపాక వరప్రసాదరావును కేసులు వెంటాడుతున్నాయి. 

ఎన్నికల్లో రిగ్గింగ్, దొంగఓట్లు ఓట్లు వేయించారన్న ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ దొంగ ఓట్లు వేయించారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. 

వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు రిటర్నింగ్ అధికారికి, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

అనంతరం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఇకపోతే 2019 ఎన్నికలలో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. హైకోర్టు ఆదేశాలతో రాపాక వరప్రసాద్ చిక్కుల్లో పడినట్లే అని తెలుస్తోంది.  

ఇకపోతే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు వైసీపీ నాయకులతో సత్సమసంబధాలు ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. 

ఇటీవలే వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేశారు రాపాక వరప్రసాదరావు. అంతేకాదు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. అటు అసెంబ్లీలో కూడా ప్రశంల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. 

రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాపాక వరప్రసాదరావు తన నియోజకవర్గంలో మినహా వైసీపీతో సమన్వయంతో ముందుకు పోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఇకపోతే రాపాక వరప్రసాదరావును రాజకీయాల్లోకి ఆహ్వానించింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో రాజోలు టికెట్ ఇవ్వడంతో ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కాస్త స్తబ్ధుగా ఉన్న ఆయన 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.