విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలయిన పిటిషన్ పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. 

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాఖలయిన ఓ పిటిషన్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిపింది. స్టీల్ ప్లాంట్‌ తరఫున కేంద్ర ఆర్థిక, ఉక్కు, గనులు శాఖలను కౌంటర్ వేయాలని గతంలో న్యాయస్థానం కోరిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక శాఖ తరఫున వేసిన కౌంటరే మిగిలిన శాఖలకు వర్తిస్తుందన్న కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఇక ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు... వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయాల ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది యలమంజుల బాలాజీ ప్రస్తావించారు. ప్రైవేటీకరణ సమయలో భాగస్వాములు అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని బాలాజీ అడిగారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు. కేంద్రం వేసిన కౌంటర్‌పై రిజైన్డర్ వేసేందుకు రెండు వారాల సమయం కావాలని కోర్టును బాలాజీ కోరారు. దీంతో ఈ విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. 

read more విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యోగులకు కేంద్రం షాక్: హైకోర్టులో అఫిడవిట్

ఇదిలావుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగారు. జంతర్ మంతర్ ప్రాంతం విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదాలతో మారుమోగిపోయింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన ఈ ధర్నాకు వైసీపీ మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ ఎంపీలు ధర్నాలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఎన్నో పోరాటాలతోనే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. 1991లో విశాఖలో స్టీల్ ఉత్పత్తి ప్రారంభమైందని.... ఆ తర్వాత దేశంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీగా అవతరించిందన్నారు. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి సుమారు 70 వేల మంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము ఒప్పుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటికీ నెలకు రూ 200 కోట్ల లాభాలతో ఈ ఫ్యాక్టరీ నడుస్తుందన్నారు. ఇలాంటి ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని ఆయన కోరారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు కార్మికులు ఈ ఆందోళనకు పూనుకొన్నారు.