బెయిల్ పై విడుదలైన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మరిన్ని షరతులు విధించాలంటూ ఏపీ హైకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న(మంగళవారం)నే జైలునుండి విడుదలయ్యారు. అయితే ఆయనకు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం కొన్ని షరతులు కూడా విధించింది. అయితే చంద్రబాబు విడుదల తర్వాత నిబంధనలు పాటించడంలేదని... రాజమండ్రి నుండి ఉండవల్లి నివాసానికి భారీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లినట్లు వైసిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సిఐడి అధికారులు మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరుపుతోంది.
ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయవాదులు పాస్ ఓవర్ కోరారు. దీంతో విచారణను వాయిదా వేసి మధ్యాహ్నం భోజన విరామం తర్వాత తిరిగి చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభం కానుంది.
ఇక ఇప్పటికే ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసారు. జైల్లోంచి విడుదలైన చంద్రబాబు ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని... ఆయనను చూసేందుకు ప్రజలే స్వచ్చందంగా వచ్చినట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని న్యాయవాదులు న్యాయమూర్తికి తెలియజేయనున్నారు.
Read More ఉండవల్లి టు హైదరాబాద్... నేడు చంద్రబాబు ప్రయాణం ఇలా సాగనుంది
ఇదిలావుంటే చంద్రబాబు జైలు నుండి విడుదల తర్వాత హైకోర్టు నిబంధనలను పాటిస్తూనే ఇంటికి చేరుకున్నారని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎక్కడ కూడా ఆయన రాజకీయ యాత్ర చేపట్టలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడ సీపీ కాంతి రాణా టాటాకు అచ్చెన్నాయుడు సందేశం పంపారు.
వేలాదిగా ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చినా ఎక్కడా చంద్రబాబు వాహనం దిగలేదని అచ్చెన్న స్పష్టం చేశారు. కోర్టు నిబంధనలకు లోబడి ప్రయాణిస్తున్నందున తన వాహనశ్రేణి వెంబడి ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని సీఐ రాజుకు చంద్రబాబు కోరినట్లు సీపీకి వివరించారు. టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మంగళవారం సాయంత్రమే పిలుపునిచ్చినట్లు అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
