తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మార్చి 30కి వాయిదా వేసింది.  

టీటీడీ బోర్డులో (ttd borad) ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై ఏపీ హైకోర్టులో (ap high court) శుక్రవారం విచారణ జరిగింది. ఈ నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో కల్యాణదుర్గం టీడీపీ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు (uma maheshwara naidu) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వులు అధిగమించేందుకు ఆర్డినెన్స్ తెచ్చారని పిటిషనర్ తరుపు న్యాయవాదులు వాదించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

టీటీడీ బోర్డులో కొంత మందికి నేర చరిత్ర ఉందని ఆరోపిస్తూ.. ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోపై బీజేపీ నేత భానుప్రకాశ్‌, మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు. 52 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారని వారిలో కొంత మందికి నేర చరిత్ర ఉందని, ఇంత మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసురావడంపై వారు మరోసారి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది.

ఇకపోతే, టీటీడీ నూతన బోర్డును నియమకానికి సంబంధించి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా జీవోలు జారీచేసిన సంగతి తెలిసిందే. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండో సారి అవకాశం కల్పించిన జగన్ సర్కార్.. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నలుగురు అధికారులతో పాటు 24 మందిని సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌కు అవకాశం కల్పించారు. వీరికి తోడు గతంలో ఎప్పుడూ లేనంతగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

టీటీడీకి జంబో పాలకవర్గం ఏర్పాటు చేయడాన్ని టీడీపీ సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించాయి. ఈ జీవోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన జీవోను సస్పెండ్ చేసింది. మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో నేర చరిత్ర ఉన్నవారిని నియమించారంటూ గత కొద్ది రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.