అమరావతి: అమరావతి రాజధానిపై దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. తాము ఇంప్డీలడ్ అవుతామని దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. రాజధాని ప్రధాన పిటిషన్లపై ఎపీ హైకోర్టు తుది విచారణను చేపట్టింది.

ప్రధాన పిటిషన్లపై విచారణకు నేరుగా హాజరు కావడానికి కొంతమ మంది న్యాయవాదులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మరికొంత మంది న్యాయవాదులు ఆన్ లైన్ ద్వారా తమ వాదనలను వినిపించడానికి అనుమతి ఇచ్చింది. 

విశాఖ అతిథి గృహానికి సంబంధించి ప్రణాలిక తయారు చేసి తమకు సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మాణం పరిపాలన రాజధానిలో భాగంగా నిర్మిస్తే పిటిషనర్లు తమ దృష్టికి తేవచ్చునని చెప్పింది. ఇవన్నీ జరిగిన తర్వాత వాదనలు వింటామని చెప్పింది. 

రాజధాని కేసులో సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఎ చట్టం రద్దులను సవాల్ చేస్తూ దాఖలైన 64 పిటిషన్లపై విచారణ జరిగింది. రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు శ్యాందివాన్ వాదనలు వినిపించారు.