అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి షాక్ తగిలింది. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. 

శనివారం హౌజ్ మోషన్ పిటీషన్ పై వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఆ పిటీషన్ ను తిరస్కరించింది. ఇప్పటికే వైఎస్ జగన్ పై దాడి కేసు విచారణను హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏను ఆదేశించింది. ఎన్ఐఏ కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుంది. వారం రోజులపాటు కస్టడీలో తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఐదు రోజుల్లోనే విచారణ పూర్తి చేశారు. 

ఇకపోతే వైఎస్ జగన్ పై విశాఖపట్నం  విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన కేసును ఎన్ఐఏకే అప్పగించడాన్ని ఏపీ సర్కార్ మెుదటి నుంచి తిరస్కరిస్తోంది. పలు బహిరంగ సభలలోనూ, ప్రెస్మీట్లలోనూ చంద్రబాబు నాయుడు అభ్యంతరం తెలిపారు. రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చుతుందంటూ ప్రభుత్వం మండిపడుతోంది.

అంతేకాదు ఎన్ఐఏకి సహాయ నిరాకణ చేపట్టింది. కేసుకు సంబంధించి ఆధారాలు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినా ఎన్ఐఏ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా విచారణను వేగవంతం చేసింది. జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించొద్దంటూ ఏపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది ఫలించకపోవడంతో న్యాయపోరాటానికి దిగింది.

నిందితుడు శ్రీనివాసరావు ఎన్‌ఐఏ కస్టడి గడువు ముగిసిన రోజే విచారణను నిలిపివేయాలంటూ హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అటు ఎన్ఐఏ అధికారులు సైతం కోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసులు తమకు సహకరించడం లేదని కేసు రికార్డులు, సీజ్ చేసి సాక్ష్యాధారాలు ఇవ్వడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. 

మరోవైపు నిందితుడు శ్రీనివాసరావును విశాఖ లేదా రాజమండ్రి తరలించాలని ఏపీ పోలీసులు, ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లు వేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం వేసిన హౌజ్ మోషన్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.