అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా కమీషన్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల ఫీజులపై విద్యా కమీషన్ జారీచేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది.  ఫీజుల సిఫార్సు అంశంలో ఏపీ ఉన్నత విద్యా కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది.  

అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల ఫీజుల అంశంలో ఉన్నత విద్యా కమీషన్ చట్టాలను, నిబంధనలు పాటించలేదని హైకోర్టు పేర్కొంది. కళాశాలల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సొంత రుసుములను కమీషన్ సిఫార్సుచేయడం చట్ట ఉల్లంఘనే అని పేర్కొంది. 

read more  తాగి ఇంటిపైకి...రోడ్డుపై పోతుంటేకూడా...: బిసి జనార్ధన్ రెడ్డి భార్య ఆందోళన

2020-21, 2021-22 విద్యా సంవత్సరానికి ప్రైవేటు, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో ఫీజులు ఖరారు చేస్తూ జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది జగన్ సర్కార్. ఈ ఏడాది జనవరి 8న ఈ జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. అయితే ఫీజుల ఖరారుపై ముందస్తుగా కళాశాలకు సమాచారం ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాయి శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాల కళాశాలల యాజమాన్యాలు. 

ఈ క్రమంతో కళాశాలల యాజమాన్యాల పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఫీజులకు సంబంధించి జారీచేసిన జోవో నెం1 ను కొట్టి వేసిన న్యాయస్థానం కళాశాలలకు ముందస్తు సమాచారం ఇచ్చి... వారితో చర్చలు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు తాత్కాలిక రుసుములే విద్యార్థుల నుండి వసూలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.