అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎబిఎన్, టీవీ5 ఛానెల్స్ ప్రసారాలను పునరుద్దరించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి.

ఈ రెండు చానెల్స్ ను ఆయా జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన నేతల కారణంగా ప్రసారాలు చేయకుండా ఎంఎస్ఓలు నిలిపివేశారని ఆయా ఛానెల్స్  యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.  తమ ఛానెల్స్ ను పునరుద్దరించాలని కోరుతూ ఈ రెండు చానెల్స్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో  హైకోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కథనాలు ప్రసారం చేసినందుకు గాను ఈ  రెండు ఛానెల్స్‌ ప్రసారాలను నిలిపివేసిట్టుగా ఆ ఛానెల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ తీరును టీడీపీ, బీజేపీతో పాటు మేథావులు, జర్నలిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్  సమీపంలో ఎంఎస్ఓలతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలి వెంకటేశ్వరరావులు సమావేశం ఏర్పాటు చేసి టీవీ5, ఏబిఎన్ ప్రసారాలను నిలిపివేయాలని ఎంఎస్ఓలను బెదిరించారని  ఈ ఛానెల్స్ యాజమాన్యాలు  ఆరోపణలు చేస్తున్నాయి.

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై తీవ్రమైన విమర్శలు చేసిన సాధారణ ప్రజలపై కూడ కేసులు పెడుతున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

వైఎస్ఆర్‌సీపీ మాత్రం కనీసం తమపై విమర్శలను తట్టుకోలేకపోతోందని  టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.

టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలకు పూర్తిస్థాయి మెజారిటీని  ప్రజలు ఇచ్చినా కూడ తమకు అనుకూలమైన మీడియా ద్వారా ప్రజలను ప్రభావితం చేయలేరని  బీజేపీ నేత సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. మీడియా తన పాత్రను పోషించాలని ఆయన కోరారు.

వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలు తాము అధికారంలో ఉన్న సమయంలో  తమకు వ్యతిరేకమైన మీడియాను అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేశాయని ఎంఎస్ఓ నేత ఒకరు చెప్పారు.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీవీ, సాక్షి చానెల్స్ ను రెండు దఫాలు నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఎబిఎన్, టీవీ5లను నిలిపివేసినట్టుగా ఆయన చెప్పారు.

నిర్మాణాత్మకమైన విమర్శలను తమ పార్టీ స్వీకరించనున్నట్టుగా అమలాపురం ఎంపీ చింత అనురాధ చెప్పారు. కానీ, ఉద్దేశ్యపూర్వకంగా మీడియాలోని ఓ వర్గం తమ పార్టీపై వ్యతిరేకమైన ప్రచారం చేస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.