అమరావతి: గత వారం అనూహ్యంగా నిమ్మ ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. మార్కెట్‌లో ఒక్కసారిగా పతనమైన నిమ్మకాయల ధరలు ఆ రైతులను అంతులేని ఆవేదనకు గురి చేశాయి. పొరుగు రాష్ట్రాలలో పలు కారణాల వల్ల మార్కెట్లు మూత బడడంతో నిమ్మ ఎగుమతులు నిల్చిపోయాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా నిమ్మకాయల ధరలు పడిపోయాయి. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌ అయిన ఏలూరులో గత శుక్రవారం (24వ తేదీ) కేజీ నిమ్మకాయల ధర దారుణంగా కనీస స్థాయికి రూ.2కి పడిపోయింది. దీంతో నిమ్మ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

దీంతో నిమ్మ రైతులను ఆదుకోవాలన్న సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రంగంలోకి మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆ మర్నాటి నుంచే మార్కెట్‌లో  నిమ్మ  కొనుగోళ్లు మొదలు పెట్టారు. కేజీ నిమ్మకాయల ధర రూ.9 చొప్పున ఏలూరు మార్కెట్‌లో మార్కెటింగ్‌ శాఖ కొనుగోలు చేయడంతో నిమ్మ ధరల్లో భారీ పెరుగుదల కొనసాగింది.

నేరుగా రంగంలోకి దిగిన మార్కెటింగ్‌ శాఖ గత శనివారం నుంచి సోమవారం వరకు మార్కెట్ల నుంచి 2.1 టన్నుల నిమ్మకాయలు కొనుగోలు చేసింది. ధరల స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం ఈ కొనుగోళ్లు జరిపింది.

మరోవైపు మరింత చొరవ చూపిన మార్కెటింగ్‌ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న ఇతర రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా బెంగాల్‌ వంటి తూర్పు రాష్ట్రాల అధికారులతో ఆయన మాట్లాడడంతో, బెంగాల్‌లో మార్కెట్లు తెరుచుకున్నాయి. దీంతో ఎగుమతులు మొదలు కావడంతో నిమ్మ ధరలు మళ్లీ గణనీయంగా పెరిగాయి.

read more   ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు కోసం...కేంద్ర మార్గదర్శకాలపై సీఎం జగన్ సమీక్ష

మార్కెట్‌లో నిమ్మ కొనుగోలు పెరగడంతో, రైతులకు గరిష్టంగా ధరలు దక్కాయి. ఏలూరు మార్కెట్‌లో సోమవారం కిలో నిమ్మకాయలను వ్యాపారులు రూ.40 వరకు కొనుగోలు చేశారు.
 గత శుక్రవారం ఏలూరు మార్కెట్‌లో కిలో నిమ్మకాయల ధర కనిష్టంగా రూ.2 నుంచి గరిష్టంగా రూ.5 వరకు పలకగా, శనివారం మార్కెటింగ్‌ శాఖ జోక్యంతో ఏలూరుతో పాటు, దెందులూరు మార్కెట్‌లో కిలో గరిష్టంగా రూ.9 పలికింది.

ఇక సోమవారం నాడు ఏలూరు మార్కెట్‌లో కిలో నిమ్మకాయలు రికార్డు స్థాయిలో రూ.40 వరకు కొనుగోళ్లు జరిగాయి. మరోవైపు దెందులూరు మార్కెట్‌లో కూడా కిలో నిమ్మ రూ.30 వరకు, ప్రైవేటు రంగంలో పని చేస్తున్న గూడూరు మార్కెట్‌లో రూ.11.50 వరకు వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. 

పంటలకు కనీస గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. రైతుల ఉత్పత్తుల ధరలు పతనమైనప్పుడల్లా, ఆ నిధిని ఉపయోగిస్తూ మార్కెట్‌లో జోక్యం (ఎంఐఎస్‌) ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు. తాజాగా అదే విధానంలో పెద్ద ఎత్తున నిమ్మ కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఆ రైతులకు కొండంత అండలా నిల్చింది.

రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న పంటలలో నిమ్మ ఒకటి. ఆ పంటకు రాష్ట్రంలో ప్రధానంగా ఏలూరు, తెనాలి, దెందులూరుతో పాటు, గూడూరులో మార్కెట్లు ఉన్నాయి. వాటిలో గూడూరు మార్కెట్‌ ఒక్కటే ప్రైవేటు ఆధ్వర్యంలో కొనసాగుతుండగా, మిగిలినవన్నీ ప్రభుత్వ మార్కెట్లు.