ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి అదనపు హంగులు ఏర్పాటు చేస్తున్నారు. జగన్ క్యాంపు కార్యాలయం రక్షణ, నిర్వహణ, కొత్త సదుపాయాల కల్పన కోసం వివిధ పద్దుల కింద రూ.1.94కోట్లు కేటాయింపునకు పరిపాలనా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం వార్షిక నిర్వహణకు రూ.1.20 కోట్లు కేటాయించారు. ఇక్కడి జగన్‌ నివాసం, క్యాంపు కార్యాలయంలో అల్యూమినియం కిటికీలు కొత్తగా ఏర్పాటు చేయడానికి గత నెలలో రూ.73 లక్షలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫర్నిచర్‌ కోసం రూ.39 లక్షలు కేటాయిస్తూ రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు.

AlsoRead బీజేపీ ఆఫీసులో వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది..?...

హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న నివాసంలో కొన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కోసం కూడా నిధులు మంజూరు చేయడం గమనార్హం. మొత్తం రూ.35.50లక్షలు విడుదల చేయడానికి పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు సూచనలు చేసింది.

హైదరాబాద్ సెక్రటేరియట్‌లో ఉన్న ఎల్ బ్లాక్‌లో సీసీటీవీ కెమెరాలు రీ ఇన్‌స్టాల్ చేయనున్నారు. లోటస్‌పాండ్‌లో జగన్ క్యాంప్ నివాసం వద్ద సోలార్ పవర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. వీటికి రూ.18లక్షల ఖర్చు కానుంది.

లోటస్ పాండ్ నివాసం వద్ద బూమ్ బారియర్స్ ఏర్పాటుకు రూ.8లక్షలు, లోటస్ పాండ్ నివాసానికి లోపల, బయట ఎలక్ట్రికల్ పనులకు రూ.4.50లక్షలు కేటాయించారు.