మద్యం బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను దాదాపు రెట్టింపు చేసింది. ఇదే సమయంలో కరోనా వైరస్ రావడంతో చుక్క దొరక్క మందు బాబులు పిచ్చెక్కిపోయారు.

దీంతో ప్రభుత్వం మళ్లీ ధరలను పెంచింది. ఎప్పుడైతే మద్యం ధరలు పెరిగిపోయాయో, మందుబాబులు హ్యాండ్ శానిటైజర్లను తాగడం మొదలుపెట్టారు. అంతంత రేటు పెట్టి మద్యం కొనుక్కునే బదులు.. శానిటైజర్ కొనుక్కోవడం బెటరని భావించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

శానిటైజర్ తాగితే.. ప్రాణాలు పోయే ప్రమాదం వుంది కదా అని అంటే.. మందు మానలేం కాబట్టి ఇలా చేస్తున్నాం అని సమర్ధించుకుంటున్నారు మందుబాబులు. అయితే ప్రకాశం జిల్లా కురిచేడు ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ క్రమంలో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పే ఆలోచనలో వుంది. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మూతపడిన లిక్కర్ షాపులను మళ్లీ తెరిచిన తర్వాత 75 శాతం మేర లిక్కర్ ధరలను పెంచింది ప్రభుత్వం.ఆ పెంచిన ధరల్లో ప్రస్తుతం కొంతమేర తగ్గించే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కనీసం 30 నుంచి 40 శాతం మేర లిక్కర్ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 శాతం వరకు తగ్గే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. ఇదే బాటలో మిగిలిన బ్రాండ్లు, ధరలను కూడా తగ్గించవచ్చట.

మరోవైపు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా అవుతోంది. వీటిని కట్టడి చేయడానికే జగన్ సర్కార్ మద్యం ధరల తగ్గింపు దిశగా ప్రణాళిక రచించినట్లుగా తెలుస్తోంది.