ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేదువార్త. జూలై నెల వేతనాలు చెల్లింపు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఏపీ ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూలై నెలకు సంబంధించి 4 లక్షల మంది ఉద్యోగులకు గురువారం నాటికి బ్యాంకుల్లో జమ కావాల్సిన జీతం ఇంకా పడలేదు.

దీంతో ఉద్యోగులు ఆర్ధిక శాఖను సంప్రదించారు. సాధారణంగా ప్రతి నెల 1న ఆర్బీఐ ఈ-కుభేర్ ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులు జరుగుతాయి.

ఏపీకి సంబంధించి అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైల్స్‌ యధాప్రకారం జూలై 31నే ఆర్బీఐకి పంపామని.. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన దస్త్రాల చెల్లింపు ఆలస్యమైనట్లు ఆర్ధిక శాఖ తెలిపింది.

ఈ సమస్యను వెంటనే పరిష్కరించి.. వేతనాల చెల్లింపు చేస్తామని అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం లోగా వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో పడతాయని పేర్కొంది. అయితే ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగానే జీతాల చెల్లింపులు ఆలస్యమైందని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.