Asianet News TeluguAsianet News Telugu

హెచ్ఆర్ఏపై వీడని పీటముడి.. సంక్రాంతి తర్వాత సమావేశం, అవసరమైతే పోరుబాట: ఏపీ ఉద్యోగ సంఘాలు

ఏపీలో హెచ్ఆర్ఏ (hra) పీటముడి వీడటం లేదు. ఈ నేపథ్యంలో గురువారం సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి చర్చలు జరిపారు. సీఎస్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

ap govt employees meets cmo officials over hra issue
Author
Amaravathi, First Published Jan 13, 2022, 4:57 PM IST

ఏపీలో హెచ్ఆర్ఏ (hra) పీటముడి వీడటం లేదు. ఈ నేపథ్యంలో గురువారం సీఎంవో అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు మరోసారి చర్చలు జరిపారు. సీఎస్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షనర్స్ బెనిఫిట్స్‌పై రాజీ లేకుండా పోరాడుతామన్నారు ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. గురువారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు కొనసాగిస్తున్న శ్లాబ్‌లను కొనసాగించే విధంగా జీవోలు వచ్చేలా పోరాటం చేస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు. ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా జీవోలు ఇచ్చిన పక్షంలో తాము తక్షణమే సమావేశం నిర్వహించి, ఉద్యమ బాట పడతామని బొప్పరాజు తెలిపారు. 

కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (Andhra Pradesh Government Employees Association) తెలిపింది. ఏపీజీఈఏ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిశారు. తమకున్న అభ్యంతరాలపై సీఎస్‌కు విజ్జపన పత్రం అందజేశారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని అన్నారు. అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను మాకు ఇవ్వాల్సిందని లేఖలో పేర్కొన్నారు.  

2010లో అప్పటి పీఆర్సీ సిఫార్సులతో 39 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని.. ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందని ఉద్యోగుల సంఘం లేఖలో పేర్కొంది. ఇంటి అద్దె భత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగించాలని కోరింది. 70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే చెల్లించాలన్నారు. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు భత్యాలు కొనసాగించాలని విజ్జప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1993 నుంచి పనిచేస్తున్న కంటింజెంట్, ఒప్పంద సిబ్బందిని క్రమబద్దీకరించాలని కోరింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలిపింది. 

ఇక, గతవారం ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. 23.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వనున్నట్టుగా తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల ఏటా ఖజానాపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఈ ఏడాది జూన్ 30 లోపుగా కారుణ్య నియామకాలను చేపడుతామని  సీఎం హామీ ఇచ్చారు. పెంచిన జీతాలను ఈ  నెల నుండి అమల్లోకి వస్తాయని సీఎం హామీ ఇచ్చారు.2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు చేస్తామని కూడా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా సీఎం జగన్  చెప్పారు. రెండు వారాల్లో  employees సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ జూన్ 30 లోపుగా ప్రోబేషణ్ కన్‌ఫర్మేషన్ ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios