ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 47 లక్షల మందికి పెన్షన్లు అందించి 80 శాతం పనిని పూర్తి చేశారు వాలంటీర్లు.

పెన్షన్ పంపిణీపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మొదటి తారీఖుకే గడప వద్దకే పెన్షన్లను అందించి అదే రోజు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో వీలుకాదు అనుకుంటే రెండవ రోజుకు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

సీఎం ఆదేశాలతో పక్కా ప్రణాళిక రూపొందించిన అధికారులు ఆదివారం ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెన్షన్లకోసం పడిగాపులు, క్యూలైన్లు, అలసత్వానికి పూర్తిస్థాయిలో చెక్‌ పెట్టేలా... మారుమూల ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీపై ముందస్తు సన్నాహాలు చేశారు.

 

 

దీంతో లబ్ధిదారులకు ఒకటో తేదీ ఆదివారమైనా లబ్ధిదారులకు పెన్షన్లు అందాయి. తద్వారా గడప వద్దకే పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1న ఎదురైన సమస్యలకు అధికార యంత్రాంగం చెక్ పెట్టింది.

ఆదివారం ఉదయం ఇంటి వద్దకు వచ్చిన వాలంటీర్లు.. లబ్ధిదారుల చేతిలో నగదును పెట్టారు. అర్హులై గత వారం అందనివారికి, వెరిఫికేషన్‌ పూర్తయిన వారికి ఒకేసారి రూ.4,500 పెన్షన్‌ను అందించారు.

పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కార్యదర్శులు, కలెక్టర్లు, ఇతర అధికారుల పర్యవేక్షించారు. జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహించారు. 

పంపిణీ వివరాలు:
ఉదయం 8 గంటల నాటికి.. 26,20,673 పెన్షన్లు పంపిణీ
ఉదయం 9 గంటలకు 31లక్షల పెన్షన్లు పంపిణీ
ఉదయం 10 గంటల నాటికి 37.5 లక్షల పెన్షన్ల పంపిణీ
ఉదయం 11 గంటల నాటికి 41.12 లక్షల పెన్షన్ల పంపిణీ
దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు, మొత్తం రూ. 1,384 కోట్లు పంపిణీ
2019 జనవరిలో పెన్షన్ల మొత్తం రూ. 490 కోట్లు మాత్రమే