అమలాపురంలో చోటు చేసుకున్న అల్లర్లపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అందరి అభిప్రాయం మేరకే జిల్లా పేరు మార్చినట్లు ఆయన తెలిపారు. కొన్ని అరాచకశక్తులు కావాలనే ఆందోళన చేశాయని ఆరోపించారు

కోనసీమ జిల్లాకు (konaseema district) అంబేద్కర్ (ambedkar ) పేరు పెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం జరిగిన ఆందోళన హింసాత్మక పరిస్ధితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) స్పందించారు. అన్ని పక్షాల అభిప్రాయం మేరకే జిల్లా పేరు మార్పు జరిగిందన్నారు. దీంట్లో ప్రభుత్వ స్వప్రయోజనాలు ఏమీ లేవని.. ఏవో కొన్ని అరాచకశక్తులు కావాలనే ఆందోళన చేశాయని ఆరోపించారు. పరిస్థితులు చక్కబడతాయని.. అంతా సవ్యంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

జిల్లాల విభజన (ap new district) సందర్భంగా ఆ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతులు వచ్చాయని.. విస్తృతంగా డిమాండ్ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని సజ్జల తెలిపారు. అంబేడ్కర్ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ అని రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. రెచ్చగొట్టడం ఎవరూ చేసినా తప్పేనని.. మా పార్టీకి వచ్చే ప్రయోజనం ఇందులో ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది అయితే కాదని.. ఒక మహానేత పేరు పెడితే పునరాలోచించాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలని.. ముందు అందరూ సంయమనం పాటించాలని రామకృష్ణారెడ్డి కోరారు. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని.. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని సజ్జల పేర్కొన్నారు. 

అటు పరిస్ధితిని సమీక్షించేందుకు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురానికి చేరుకున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన విరమించి వెళ్లిపోవాలని పోలీసులు నిరసనకారులను కోరుతున్నారు. అటు అమలాపురం ప్రాంతంలో వున్న ప్రజా ప్రతినిధులందరినీ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించి... పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపురంలో అంధకారం నెలకొంది. 

ALso read:amalapuram voilenece : గాల్లోకి కాల్పులు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు, అమలాపురానికి చేరుకున్న డీఐజీ

హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాలరాజు హెచ్చరించారు. ఎవరూ హింసకు పాల్పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఒక్కసారిగా 4 వేల మంది వచ్చారని.. ఆందోళన కారులపై చర్యలు వుంటాయన్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తామని.. అమలాపురం పూర్తిగా కంట్రోల్‌లో వుందన్నారు. ఎవరూ పుకార్లు నమ్మొద్దని డీఐజీ సూచించారు. 

ఇకపోతే.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా కోనసీమ జిల్లా పేరును మార్చిన సంగతి తెలిసిందే. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు ఇచ్చిన వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆందోళనలు నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు విధించారు.