జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అడిగారని చంద్రబాబునాయుడు అనుమతిచ్చేసారు. ఇంతకీ పవన్ అడిగిందేంటి? చంద్రబాబు ఇచ్చిందేమిటి?  అదేగా మీ సందేహం. అదేనండి పవన్ కొత్తగా నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా విషయం లేండి. ఇంతకీ విషయం ఏంటంటే, పవన్ కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’ అదనపు షోల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. అనుమతి కూడా అలా ఇలా కాదు. ఏకంగా 8 రోజుల పాటు 24 గంటలూ సినిమా థియేటర్లలో  షోలు వేసుకునేందుకు అవసరమైన అనుమతులను ఇచ్చేసింది.

ఇప్పటి వరకూ థియేటర్లలో సినిమాలను ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్యలో మాత్రమే ప్రదర్శించాలి. అయితే, పవన్ కొత్త సినిమాకు జనాల్లో ఉన్న క్రేజ్ ను  దృష్టిలో పెట్టుకుని షోల ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులు కావాలని సినిమా యూనిట్ ప్రభుత్వాన్ని అడిగింది. అదనపు షోల కోసం పర్మిషన్ అడిగింది పవన్ కదా ? పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా ఉంటారా ? సంబంధిత ఫైల్ పై చంద్రబాబు వెంటనే సంతకం చేసేసారు. ఇంకేముంది అర్ధరాతి 1 గంట నుండి ఉదయం ఉదయం 10 గంటల మధ్యలో అదనంగా మరో మూడు షోల ప్రదర్శనకు అనుమతులు వచ్చేశాయి.

నిజానికి అదనపు షోలు వేయటం కొత్తేమీ కాదు. ప్రతీ హీరో సినిమా రిలీజ్ సమయంలో మామూలుగా జరిగేదే. కాకపోతే అనధికారికంగా జరుగుతాయి. కానీ పవన్ విషయంలో మాత్రం ప్రభుత్వం అధికారికంగా అనుమతిచ్చింది. ఎందుకంటే, చంద్రబాబు-పవన్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధమే కారణం. రాష్ట్రంలో ఏ క్రైసిస్ తలెత్తినా వెంటనే చంద్రబాబును ఒడ్డునపడేసేందుకు పవన్ ఎంతలా కష్టపడుతున్నారో అందరూ చూస్తున్నదే. అందుకనే చంద్రబాబు కూడా పవన్ అడగ్గానే అదనపు షోలకు అనుమతులు ఇచ్చేశారు. నిజానికి తెల్లవారుజామున 1 గంట నుండి అర్ధరాత్రి 12 గంటల వరకూ ప్రభుత్వం అనుమతిచ్చింది 7 షోలకే. కానీ సినిమా జనాలు 7 షోలు కాదు ఏకంగా 10 షోలు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.