ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ఆన్‌ లైన్ అమ్మకం అమలు ప్రక్రియ కసరత్తు తుదిదశకు చేరినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి టెండ‌ర్లలో.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు బాబీ డైరెక్టర్‌గా ఉన్న Just Tickets సంస్థ ఎల్‌-1 గా నిలిచినట్టుగా సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ఆన్‌ లైన్ అమ్మకం అమలు ప్రక్రియ కసరత్తు తుదిదశకు చేరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌లో AP Cinemas (Regulation) (Amendment) Bill 2021కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే ఆన్‌లైన్ మూవీ టికెటింగ్ సిస్టమ్‌కు మార్గం సుగమం చేసింది. సినిమా టిక్కెట్ ధరలను నియంత్రించడంలో, ప్రేక్షకుల నుంచి దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వానికి ఈ సవరణ సహాయపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

రైల్వే టికెట్ల బుకింగ్‌ తరహాలో ఈ పోర్టల్‌ను రూపొందించాలన్నది తమ ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం అన్ని థియేటర్లు ఒకే సంస్థ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు చేసేలా చర్యలు చేపట్టనుంది. అంతేకాదు ప్రేక్షకులపై ఆన్‌లైన్‌ చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరినట్టుగా సమాచారం. 

ఏపీటీఎస్‌ ద్వారా సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించింది. పలు సంస్థలు టెండర్లు వేసినా రెండు సంస్థలు మాత్రమే తక్కువకు కోట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో చెన్నైకి చెందిన జస్ట్‌ టికెట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఎల్‌-1 గా నిలిచినట్టుగా సమాచారం. తక్కువ సర్వీస్ చార్జీలు తీసుకునేందుకు జస్ట్ టిక్కెట్ ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ ప్రకారం జస్ట్ టిక్కెట్‌కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఇక, ఏప్రిల్ నుంచే ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అతిత్వరలోనే సినిమా టికెట్ల విక్రయించే సంస్థ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక, జస్ట్ టికెట్స్ సంస్థ విషయానికి వస్తే.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడు అల్లు వెంకటేశ్‌ (అల్లు బాబీ) డైరెక్టర్‌గా ఉన్నారు. 

ఇక, ఈ నిర్ణయం ద్వారా టికెట్‌ రేట్ల నియంత్రణతో పాటు, బ్లాక్‌ టికెట్ల విక్రయ దందాకు చెక్‌ పడనుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులు క్యూలలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితికి ముగింపు పలికినట్టుగా అవుతుందని తెలిపాయి. అయితే ఈ ఆన్‌లైన్ టికెట్ విధానంలో డబ్బులు ప్రభుత్వంకి రాగా.. వాటిని తర్వాత థియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వనున్నారు.