అమరావతి:రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు గురువారం నాడు సిఫారసు చేసింది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఈ పదవికి ముగ్గురి పేర్లను రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది.

 ఎసీఈసీ పదవికి గాను ముగ్గురు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరైన నీలం సహానీ, మరో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎం. శామ్యూల్, మరో రిటైర్ట్ అధికారి ఎల్. ప్రేమచంద్రారెడ్డి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది.

నీలం సహానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నారు. శామ్యూల్ నవరత్నాల పర్యవేక్షణ సలహాదారుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలను ఎల్.. ప్రేమ చంద్రారెడ్డి నిర్వహిస్తున్నారు.

ఈ ముగ్గురిలో ఎవరి పేరును గవర్నర్ ఆమోదిస్తే వారే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమితులు కానున్నారు. కొత్త ఎస్ఈసీ నియామకం పూర్తైతే  రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను తాను చేయలేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే.  నెలాఖరులోపుగా పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సమయం సరిపోదని ఆయన తేల్చి చెప్పారు.