ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఈ నెల 22 నుండి 31 వరకు బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుండి 31 మధ్య బదిలీల ప్రక్రియను ప్రారంభించనుంది ప్రభుత్వం. ఈ మేరకు బుధవారంనాడు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. 2023 ఏప్రిల్ 30 నాటికి 4 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులంతా బదిలీలకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఎక్సైజ్, శాఖ, రవాణా, వ్యవసాయ, శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ఆర్ధికశాఖ అనుమతిని ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 1 నుండి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం వర్తించనుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
సంక్షేమశాఖల పరిధిలో పనిచేసే విద్యా సంస్థల ఉద్యోగులకు బదిలీల నుండి మినహయింపు ఇచ్చింది ప్రభుత్వం.ఏసీబీ , విజిలెన్స్ విచారణ ఉన్నవారి వివరాలను ఆర్ధిక శాఖ కోరింది. తొలుత గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది,. ఆ తర్వాతే ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం.
టీచర్లతో పాటు ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెండేళ్లు ఒకే చోట పనిచేసినవారికి రిక్వెస్ట్ బదిలీ కి అవకాశం కల్పించింది. ఐదళ్లు ఒకే చోట పనిచేసినవారికి బదిలీ తప్పనిసరిగా మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.