Asianet News Telugu

15 రోజుల్లోనే లక్షా 25వేల ఉద్యోగాలిచ్చారా..? జగన్ సర్కార్ ది అంకెల గారడీ: యనమల ధ్వజం

రాష్ట్రంలో గత రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వోద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఫుల్ పేజి ప్రకటనల్లో ఉన్నవన్నీ బోగస్ లెక్కలేనని యనమల అన్నారు.

ap government released employment details all false... Yanamala ramakrishnudu akp
Author
Amaravati, First Published Jun 18, 2021, 3:41 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు:  ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మడమతిప్పి, మాటతప్పి రెండేళ్లలోనే కోటిమందికి ఉపాధి పోగొట్టారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.  కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదాను డిల్లీలో తాకట్టుపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 6,03,756 ప్రభుత్వోద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం తాజాగా విడుదల విడుదల చేసిన ఫుల్ పేజి ప్రకటనల్లో ఉన్నవన్నీ బోగస్ లెక్కలేనని అన్నారు. మీరు చెప్పేదాంట్లో పారదర్శకత ఉంటే ఇచ్చిన ఉద్యోగుల వివరాల పేర్లు, ఫోన్ నంబర్లను వెబ్ సైట్ లో పెట్టాలని యనమల డిమాండ్ చేశారు. 

''వైసిపి రెండేళ్లపాలన పూర్తయిన సందర్భంగా గతనెల 30వ తేదీన విడుదల చేసిన ప్రగతి పుస్తకంలో 4,77,953 ఉద్యోగాలు భర్తీచేసినట్లు చూపిన ప్రభుత్వం...కేవలం 15 రోజుల వ్యవధిలో ఒకేసారి 1.25లక్షల ఉద్యోగాలను పెంచి చూపడాన్ని పరిశీలిస్తే ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం చూపుతున్నవన్నీ తప్పుడు లెక్కలని తేటతెల్లమవుతోంది. గాలిమాటలు తప్ప చేసింది శూన్యం'' అని విమర్శించారు. 

''రాష్ట్రంలో రోడ్డురవాణా సంస్థలో  దశాబ్ధాలుగా పనిచేస్తున్న 50వేల మందికిపైగా విలీనం చేసిన ప్రభుత్వం...వారికి కొత్త ఉద్యోగాలు కల్పించినట్లుగా చూపడం దొంగలెక్కలుకాదా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వివిధ విభాగాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కార్పొరేషన్ లో చూపి 95,212 కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు చూపడం వంచించడమే?'' అన్నారు. 

''రాష్ట్రంలో 2.30లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా గత రెండేళ్లుగా నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం...ఇప్పుడు కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలండర్ విడుదలచేసి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. రెండేళ్లలో డిఎస్సీ ప్రకటన లేదు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ లో బిసి బ్యాక్ లాగ్ పోస్టులను ఎందుకు చూపలేదు?'' అని యనమల నిలదీశారు. 

read more  జాతీయ విద్యా విధానంతో...ఏపీలో 34వేల స్కూల్స్, 15వేల టీచర్లకు ఎసరు: జవహర్ ఆందోళన

''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రకటన చేసిన డిఎస్సీ, గ్రూప్-1 ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఇచ్చినట్లుగా చూపించుకోవడం కూడా మోసమే. వాస్తవానికి గత రెండేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో కల్పించినట్లు చెబుతున్న ఉద్యోగాలకంటే ప్రభుత్వ దోపిడీ విధానాల కారణంగా ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య దాదాపు 10రెట్లు అధికంగా ఉంది. గత రెండేళ్ల వైసిపి పాలనలో అసంఘటిత రంగంలో సుమారు కోటిమందికి పైగా ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''కేవలం 5వేల రూపాయల గౌరవ వేతనంతో వైసిపి కార్యకర్తలకు ఇచ్చిన 2,59,565 వాలంటీర్ లు, ఎపిపిఎస్సీతో సంబంధం లేకుండా వైసిపి నేతల సిఫారసులతో అధికారపార్టీ వారికే ఇచ్చిన 1,21,518 గ్రామ సచివాలయ ఉద్యోగాలు వెరసి మొత్తం 3,81,083 ఉద్యోగాలను గత రెండేళ్లలో నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగాలుగా చూపడం గోరంతను కొండంతగా చూపడమే. వాలంటీర్లు ఉద్యోగులు కాదని ప్రభుత్వమే ప్రకటించింది, ఉద్యోగులైతే కనీస వేతన చట్టం ప్రకారం రూ.18వేలు జీతం ఇవ్వాలి కదా? వాలంటీర్లు ఉద్యోగులు కాదు... స్వచ్ఛంద సేవకులు మాత్రమే అని జగన్ రెడ్డి చెప్పింది నిజం కాదా? వారికి రాసిన బహిరంగ లేఖలో ఆ విషయాన్ని పొందుపరిచిన మాట నిజం కాదా?'' అని యనమల ప్రశ్నించారు. 

''ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో వైసిపి కార్యకర్తలకు ఇచ్చిన 12వేల అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, వైద్య, ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖల్లో గౌరవ వేతనంతో నియమించిన సుమారు 20వేల తాత్కాలిక ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపడం వైసిపి ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం. కోవిడ్ సమయంలో అత్యవసర సేవలందించేందుకు 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ను తీసుకుని వారి అవసరం తీరాక రోడ్డున పడేశావు. వారు ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. 26,325 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటనల్లో రాసుకున్నారు.  రేషన్ వాహనాల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మూటలుమోసే కూలీలుగా మార్చిన 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (రేషన్ వాహనాల నిర్వాహకులు), వారికి హెల్పర్లుగా వచ్చే మరో 9,260మందికి కూడా కలిపి ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది'' అని యనమల ఎద్దేవా చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios