అమరావతి: ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.  దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని  వైఎస్ జగన్  హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుకు వీలుగా ఎక్సైజ్ పాలసీని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు.

పాదయాత్రకు ముందు జగన్ ప్రకటించిన  నవరత్నాలు పథకంలో దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ శాఖ నుండి భారీగా ఆదాయం సమకూరుతోంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ మద్యం ద్వారానే ఆదాయం ఎక్కువగా వస్తోంది.అయితే  మద్యాన్ని నిషేధించడం ద్వారా రాష్ట్రానికి తగ్గిపోయే ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు కూడ ఏపీ సర్కార్ ప్రత్యామ్నాయ వనరులపై  కేంద్రీకరించాల్సిన అవసరం లేకపోలేదు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధం అమలు విషయమై ఎక్సైజ్ శాఖ అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను ఎత్తివేయాలని అధికారులకు సూచించారు. దశలవారీగా మద్యాన్నిఎత్తివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు ఏపీలోని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం నాడు సమావేశం కానున్నారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకె మీనా నూతన ఎక్సైజ్ పాలసీ తయారీపై కేంద్రీకరించారు. ఎక్సైజ్ శాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై కూడ అధికారులతో ఆయన  చర్చిస్తారు.

బెల్ట్‌షాపుల నియంత్రణపై కూడ  ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడ ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టనుంది. స్టార్ హోటల్స్‌కు మాత్రమే మద్యాన్ని పరిమితం చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అయితే ఈ మేరకు కొత్త పాలసీ తయారీపై ఆ శాఖ ఫోకస్ పెట్టింది. కొత్త పాలసీపై అధికారులతో ఎక్సైజ్ కమిషనర్ చర్చించనున్నారు. త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీని ఏపీ సర్కార్ తీసుకురానుంది. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1994లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే  మద్యనిషేధం అమల్లో ఆ సమయంలో కొన్ని లోటు పాట్లు చోటు చేసుకొన్నాయి. 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు.