అమరావతి:పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాలపై  అసెంబ్లీ వేదికగా  మరోసారి కేంద్రం తీరును ఎండగట్టేందుకు టీడీపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నందున ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత  అసెంబ్లీ సమావేశాల నిర్వహాణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయలేదు. అయితే తాజాగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో  ఏపీ రాష్ట్రానికి  అన్ని రకాల  హమీలను  అమలు చేశామని  స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్‌పై ఏపీ సర్కార్ తీవ్రంగా మండిపడుతోంది. ఏపీకి ఏం ఇవ్వకుండానే అన్ని రకాల హమీలను అమలు చేశామని  చెప్పడంపై ఏపీ సర్కార్ తీవ్ర అసంతృప్తి ఉంది. 

కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. పార్లమెంట్‌లో జరిగే పరిణామాలను గమనిస్తూ ఏపీలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు.

ఇప్పటికే ప్రత్యేక హోదా, ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు తదితర అంశాలపై  కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా మరోసారి ఎండగట్టాలని టీడీపీ యోచిస్తోంది. ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు.

కనీసం 18 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఈ నెల 16 వతేదీ నుండి గ్రామ దర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే  ఇబ్బందులు చోటు చేసుకొనే  అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. 

ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు గ్రామదర్శిని కార్యక్రమాలను ఏక కాలంలో నిర్వహించే అవకాశం ఉంటుందా... అనే విషయాలపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆయన  సింగపూర్ నుండి  వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల నిర్వహాణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.