Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్‌లోనే కాదు గ్రామ సచివాలయాల్లో కూడ ఇసుక బుకింగ్: ఏపీ సర్కార్ నిర్ణయం

: రాష్ట్రంలో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ  తెలిపారు. 

ap government permits sand bookings in village secretariate
Author
Amaravathi, First Published Jun 7, 2020, 3:09 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: రాష్ట్రంలో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ  తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఇసుకపై పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటించిన తరువాత ఎపిఎండిసి ద్వారా పారదర్శకతతో ఇసుక విక్రయాలను నిర్వహిస్తున్నామన్నారు.. దేశంలోనే ఆన్ లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఎపికి గుర్తింపు వుందని ఆయన చెప్పారు.

 కొత్త విధానం ద్వారా వినియోగదారులకు ఇసుకను అందిస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను కూడా గుర్తించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. 

అదే క్రమంలో ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు రీచ్ లు, స్టాక్ పాయింట్లు, చెక్ పోస్ట్ లలో సిసి కెమేరాలు ఏర్పాటు చేయడం, గనుల శాఖ, రెవెన్యూ, రవాణాశాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ద్వారా తనిఖీలు చేయడం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండేళ్ళ జైలుశిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాన్ని చేసింది తెలిపారు.  

ఇకపై సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్

ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని ద్వివేది ఓ ప్రకటనలో తెలిపారు.అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్  చేసుకునే అవకాశం వుంటుందని తెలిపారు. 

వినియోగదారులు సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకున్నట్లయితే స్థానికంగా వున్న సచివాలయ వ్యవస్థ ద్వారా నిజమైన అవసరానికే సదరు బుకింగ్ జరుగుతోందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు, నిర్ధారించుకునేందుకు అవకాశం వుంటుందని అన్నారు. దీనివల్ల అవసరం లేని వారు కూడా ఇసుకను బుక్ చేసి, బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే అవకాశం వుండదని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా స్థానికులు వాడుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గతంలో వాగులు, వంకలకు చెందిన 1 నుంచి 3వ ఆర్డర్ స్ట్రీమ్ ల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుక తీసుకునే వీలుండేదని అన్నారు.

 తాజాగా ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నదులు, జలవనరులకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా తీసుకునే ఉచిత ఇసుక పరిధిని 4, 5 ఆ పై ఆర్డర్ స్ట్రీమ్ ల వరకు కూడా పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు.

 ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని అన్నారు. గుర్తించిన వాటర్ స్ట్రీమ్ ల నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఉచితంగా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల జలవనరుల సమీపంలోని ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని, ఇసుక బుకింగ్ లపై వత్తిడి తగ్గుతుందని అన్నారు. 

లాక్ డౌన్ తరువాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలను మరింత వేగవంతం చేశామని తెలిపారు. దీనిలో భాగంగా ప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. దీనిని అతిత్వరలోనే రోజుకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. 

ఈనెల ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,53,197 మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వితీశామని, దానిలో డోర్ డెలివరీ ద్వారా 33,28,553 మెట్రిక్ టన్నులు, ఇతర వినియోగదారులకు 53,57,003 మెట్రిక్ టన్నులు అందించామన్నారు.

 ఇక  ఉపాధి హామీ పనుల కోసం 7,51,189 ఎంటిలు, నాడు-నేడు పనులకు 3,29,814 ఎంటిలు, బల్క్ బుకింగ్ లకు 21,47,386 మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈనెల ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వినియోగదారులు 48,99,916 టన్నులను బుక్ చేసుకోగా, వారికి 46,20,217 టన్నులను రవాణా చేశామని తెలిపారు. కేవలం 5.7శాతం మాత్రమే వారికి పెండింగ్ వుందని తెలిపారు. అలాగే 16,70,678 టన్నుల బుల్క్ బుకింగ్ కి గానూ 14,25,797 టన్నులు రవాణా చేశామని, ఇంకా పెండింగ్ లో కేవలం 2,44,540 టన్నులు మాత్రమే వుందని వివరించారు.  

పర్యావరణ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఇసుక అందించే నదుల్లోని ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు. ఇక్కడ యంత్రాలను, ఇసుకను బయటకు పంపేందుకు లారీలు, టిప్పర్లను ఉపయోగించేందుకు నిబంధనలు అంగీకరించని నేపథ్యంలో కూలీలతో తవ్వకాలు చేసి, ట్రాక్టర్ ల ద్వారానే తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్ లకు పంపుతున్నామని తెలిపారు. 

ఇసుక ఆపరేషన్లపై జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జిల్లాలో టెక్నికల్ టీంల ఆధ్వర్యంలో రీచ్ లు, పట్టాభూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఇకపై బల్క్ బుకింగ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ల పర్యవేక్షణలోనే అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios