అమరావతి: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి మాసంలో ఇచ్చినట్టుగానే ఏప్రిల్ మాసంలో కూడ వేతనాలు ఇవ్వనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం నాడు మధ్యాహ్నం ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం కృషి చేస్తున్న వైద్య,ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్య సిబ్బంది, పోలీసులకు పూర్తి వేతనం చెల్లించనున్నారు. గత మాసంలో కూడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తొలుత సగం వేతనాన్ని చెల్లించారు. నిధులు సమకూరిన తర్వాత మిగిలిన వేతనాన్ని చెల్లించింది. ఇదే తరహాలోనే ఏప్రిల్ మాసంలో కూడ వేతనాలను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే గత మాసంలో పెన్షనర్లకు సగం పెన్షన్ మాత్రమే చెల్లించారు. అయితే ఈ నెల మాత్రం పెన్షనర్లకు పూర్తి స్థాయిలో పెన్షన్ అందించనున్నట్టుగా ప్రభుత్వం  స్పష్టం చేసింది. పెన్షనర్ల నుండి వచ్చిన వినతి మేరకు సగం పెన్షన్ కు బదులుగా పూర్తి స్థాయి పెన్షన్ ను చెల్లించనున్నట్టుగా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

also read:జగన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్: కరోనాపై చర్చ

తెలంగాణ ప్రభుత్వం మార్చి నెలలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. కరోనా విధుల్లో ఉద్యోగులకు మాత్రం పూర్తి వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించింది.

ఏపీ రాష్ట్రంలో ఆదివారం నాటికి కరోనా కేసులు 1097కి చేరుకొన్నాయి.రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.