Vijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రైతుల కోసం అన్ని మెరుగైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని అగ్రిమిష‌న్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. అలాగే, ప్రభుత్వం రైతుల కోసం రూ.85 వేల కోట్లు వ్యవసాయానికి ఖర్చు చేసిందన్నారు. 

AP Government: ప్రభుత్వం రైతుల కోసం రూ.85 వేల కోట్లు వ్యవసాయానికి ఖర్చు చేసిందని అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతు సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడుతూ అరటి, పసుపు, టమాటా పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందజేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్‌ హబ్‌గా మారుతోందనీ, రైతు బరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) రైతులకు వరంలాంటివ‌నీ, వాటిని వారి అభ్యున్నతికి వినియోగించుకోవాలని కోరారు.

అరటి పంటకు ఇన్సూరెన్స్‌ కల్పించాలని రైతులు చేస్తున్న విజ్ఞప్తులపై ఆయన స్పందిస్తూ.. సమస్యను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. 946 హెక్టార్లలో 786 మంది రైతులకు స్ప్రింక్లర్లు, మైక్రో ఇరిగేషన్ టూల్స్ అందించామన్నారు. వ్యవసాయ సలహాదారు తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయాభివృద్ధిలో మార్కెటింగ్ కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. జిల్లాలో 735 రెవెన్యూ గ్రామాలకు గాను 680 రెవెన్యూ గ్రామాల్లో 4,51,381 ఎకరాలకు సంబంధించి ఈ-క్రాప్ నమోదుపై జిల్లా కలెక్టర్ వి.విజయ రామరాజు వివరించారు.

'పాలసీ లీడర్‌షిప్' విభాగంలో అవార్డు..

ఇదిలావుండ‌గా, దేశ‌రాజ‌ధాని న్యూఢిల్లీలో ప్రఖ్యాత అగ్రికల్చర్ టుడే గ్రూప్ నిర్వహించిన 13వ అగ్రికల్చర్ లీడర్‌షిప్ కాన్‌క్లేవ్-2022లో 'పాలసీ లీడర్‌షిప్' విభాగంలో అవార్డు గెలుచుకున్నందుకు వ్యవసాయ శాఖ అధికారుల కృషిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్‌ సి హరికిరణ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ గెడ్డం శేఖర్‌బాబు గురువారం ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ టుడే గ్రూప్ వారు అందించిన అవార్డును ముఖ్యమంత్రికి చూపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గత మూడున్నరేళ్లుగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉత్తమ విధానాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అవార్డును గెలుచుకుంది. 

ఏపీ రైతు సాధికార సంస్థ‌కు 15 మిలియన్ డాలర్ల గ్రాంట్..

ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందిన ఏజెన్సీలు, ప్రభుత్వాలు, చొరవలను గుర్తించే కో ఇంపాక్ట్ అనే అంతర్జాతీయ సంస్థ నుంచి ఏపీ రైతు అధికార సంస్థ (వైఎస్ఎస్) 15 మిలియన్ డాలర్ల దాతృత్వ గ్రాంట్ ను గెలుచుకుంది. కో ఇంపాక్ట్ గ్రాంట్ తో ఇతర రాష్ట్రాల్లో వ్యవస్థాగత మార్పులకు సంస్థ కృషి చేస్తుందని ఆర్ వైఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తల్లమ్ తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వైఎస్ఎస్ 2016 లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ బేస్డ్ నేచర్ ఫార్మింగ్ (ఎపిసిఎన్ఎఫ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా 3,730 గ్రామ పంచాయతీలలో 6,30,000 మందికి పైగా రైతులను ప్రకృతి వ్యవసాయ ప్రయాణం వైపు నడిపించింది. దేశవ్యాప్తంగా రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తే వ్యవసాయ సబ్సిడీల రూపంలో ఏటా రూ.124 లక్షల కోట్లు ఆదా కావచ్చని ఒక అంచనా.