జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఓ కమిటీ, నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి మరో కమిటీ, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి ఓ కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది.

ఏపీసీఎఫ్‌ఎస్ఎస్ సీఈవో అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీకి సహాయంగా ఉండేందుకు సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయాలని సర్కార్ ఆదేశించింది.

ప్రాథమికంగా ఆరు నెలల పాటు సచివాలయం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే సబ్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు, సచివాలయ బాధ్యతలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.