ఏపీలో 55 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు..
బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 55 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 55 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, బీసీల అభ్యున్నతి కోసం వైసీపీ ప్రభుత్వం కృష్టి చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతుంటాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక 2020 డిసెంబర్‌లో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రకటన వెలువడింది.
బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. అన్ని జిల్లాలకు చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో ప్రాతినిధ్యం ఉంది. రెండేళ్ల పదవీకాలంతో వారు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల వారి పదవీకాంల పూర్తి కావడంతో.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు పొడిగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
బీసీ కార్పొరేషన్ల ప్రకటన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. గత 70 ఏళ్లలో తొలిసారిగా బీసీ జాబితాలోని అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామన్నారు. మొత్తం 56 మంది చైర్‌పర్సన్‌లు, 600 మందికిపైగా డైరెక్టర్లను నియమించి వారికి తగిన గుర్తింపు ఇచ్చామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అనేక కులాలకు రాజకీయ నియామకం లభించిందని చెప్పారు. బీసీలను తమ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా భావిస్తున్నానని, అన్ని రంగాల్లో వారి సాధికారత కోసం కృషి చేస్తున్నానని చెప్పారు.
ఈ కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, డైరెక్టర్లు తమ కులవృత్తుల అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సదుపాయం ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని కోరారు. 56 మంది ఛైర్‌పర్సన్‌లలో 29 మంది, 672 మంది డైరెక్టర్లలో 336 మంది మహిళలు ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా.. ఏపీలో అన్ని నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పారు.