విశాఖపట్టణం: విశాఖ భూముల వ్యవహారంపై సిట్ గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి నివేదికను సమర్పించాలని సిట్ ను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో భూ కుంభకోణంపై  సిట్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు 2019 అక్టోబర్ 17న సిట్ ను ఏర్పాటు చేసింది.

విశాఖతో పాటు పరిసర మండలాల్లో భూముల కొనుగోలులో చోటు చేసుకొన్న అవకతవకలపై విచారణకు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.   ఈ సిట్ విచారణ సాగుతున్న సమయంలోనే ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా వెలుగు చూశాయి.

దీంతో సిట్ విచారణ నిలిచిపోయింది.  కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గత ఏడాది జూన్ 10వ తేదీ నుండి సిట్ దర్యాప్తు సాగుతోంది.

అయితే కరోనా నేపథ్యంలో విచారణ కొంత కాలం మధ్యలో నిలిచిపోయిన నేపథ్యంలో గడువును పెంచాలని సిట్ కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువును పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు నివేదికను ఇవ్వాలని కోరింది.