అమరావతి: చంద్రబాబునాయుడు  సర్కార్ ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు వైఎస్ జగన్  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం నాడు సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చలామణి కావడంపై సీఎం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలను  మార్కెట్లో చలామణి చేసే వారిని కఠినంగా శిక్షించనున్నట్టు ఆయన హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిని అవసరమైతే జైలుకు పంపుతామని జగన్ హెచ్చరించారు.

ఈ విషయమై అసెంబ్లీలో కొత్త  విత్తన చట్టాన్ని తీసుకువస్తామని  జగన్ చెప్పారు. అక్టోబర్ రెండో తేదీ నుండి గ్రామ సచివాలయాలను అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే గ్రామ సచివాలయాల ద్వారా రైతాంగానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలను వ్యవసాయానికి కేంద్రంగా మార్చాలని సీఎం ఆదేశించారు.

అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని జగన్ సూచించారు. మంచి సూచనలు చేసిన అధికారులను సన్మానం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ, 12,500లను రైతు భరోసా కింద అందించనున్నట్టు జగన్ ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆయన వివరించారు.

రైతుల పంటలకు మద్దతు ధర అందేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ధరల స్థీరీకరణ నిధి కోసం బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి భారాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు వీలుగా అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఈ ఏడాది తొలి నాళ్లలో చంద్రబాబునాయుడు సర్కార్ ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని జగన్ సర్కార్ రద్దు చేసింది. ఈ పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు  చేయనున్నారు.