కరోనాకు సంబంధించిన గణాంకాల విషయంలో ఏపీ ప్రజలను బోగస్ అంకెలతో జగన్ సర్కార్ మోసం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో విపరీతంగా టెస్టులను నిర్వహిస్తున్నామని చెప్పుకునే జగన్ సర్కార్..... ప్రతిరోజూ 10 లక్షల మంది జనాభాకు 140కి పైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు లేదని చంద్రబాబు ప్రశ్నించారు. 

ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలను చేసి కేంద్రం ప్రకటించిన జాబితాను కూడా జతచేసారు. ఇకపోతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ప్రజలు ఇండ్లలోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. 

గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కరోనా కేసులపై బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజులో ఏపీలో పది వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,167 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 68 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 30557కు చేరుకుంది. రాష్ట్రంలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరుకుంది.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గత 24 గంటల్లో 1441 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా విశాఖపట్నంలో ఒక్క రోజులో 1223 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కర్నూలు జిల్లాలో 1252 కేసులు రికార్డయ్యాయి. అనంతపురం జిల్లాలో 954, చిత్తూరు జిల్లాలో 509, గుంటూరు జిల్లాలో 946, కడప జిల్లాలో 753 కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లలో 271, నెల్లూరు జిల్లాలో 702, ప్రకాశం జిల్లాలో 318, శ్రీకాకుళం జిల్లాలో 586, విజయనగరం జిల్లాలో 214, పశ్చిమ గోదావరి జిల్లాలో 998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మొన్నటి నుండి నిన్నటి వరకు తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది మంది చొప్పున మరణించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఆరుగురేసి మరణించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు మరణించారు నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరేసి మృత్యువాత పడ్డారు.