రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే తట్టుకోలేకపోతున్నారు: విపక్షాలపై సజ్జల ఫైర్
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. విపక్షాలకు ఎల్లో మీడియా తోడైందన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారంనాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయనే బాధ విపక్షాల్లో ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని వాళ్లే అంటారు, పరిశ్రమలు వస్తే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని విపక్షాలపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే అవి పరిశ్రమలే కాదని విపక్షాలు చెప్పడాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు బట్టారు.
తమ ప్రభుత్వం పరిశ్రమలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్న విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. నిబంధనల ప్రకారంగానే ప్రభుత్వం పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చిన సీఎం జగన్ కు బంధువులని ప్రచారం చేస్తున్నారన్నారు. విపక్షాలకు ఎల్లో మీడియా తోడైందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని ఎల్లో మీడియా తాపత్రయంగా కన్పిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బరి తెగించి తప్పుడు రాతలు రాస్తున్నారన్నారు. గత ప్రభుత్వం పరిశ్రమలకు పద్దతి లేకుండా అనుమతులు జారీ చేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయంలో ఏం చేశారో మర్చిపోయి తమ ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడన్నారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో రూ. 24 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్నిఆయన ప్రస్తావించారు. రివర్స్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.అదానీ తమకు ఏమైనా బంధువా అని ఆయన ప్రశ్నించారు. తమకు అదానీ బంధువని చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతేకాదు అవినీతి జరిగినట్టుగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడాలని జగన్ కోరుకుంటారని ఆయన చెప్పారు
చంద్రబాబుది బరి తెగింపు వ్యవహరమని ఆయన విమర్శించారు.తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రానికి తాము పరిశ్రమలు తెస్తుంటే చంద్రబాబు వెటకారం చేస్తున్నారన్నారు. .జగన్ అర్జంట్ గా దిగిపోయి, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నట్టుగా విపక్షాల తీరు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది జరిగితేనే వీళ్లకు ప్రశాంతంగా ఉంటుందేమోనన్నారు.