వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు దిట్ట: మీడియాపై సజ్జల ఫైర్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం జగన్ పై పథకం ప్రకారంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు చేస్తున్నారన్నారు.
హైదరాబాద్:ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు వీరంగం వేస్తున్నాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం జగన్ పై పథకం ప్రకారంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా గత పదేళ్లుగా కుట్రలు చేస్తున్నారన్నారు.
గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కక్షసాధింపులో భాగంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జగన్ పై కేసులు పెట్టారని ఆయన చెప్పారు. ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన తర్వాత జగన్ పై ఎడాపెడా 30 కేసులను బనాయించారని ఆయన విమర్శించారు.
also read:పొరుగు రాష్ట్రాలతో స్నేహన్ని కోరుకొంటున్నాం: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సజ్జల కామెంట్స్
టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ కీలక నేతలపై ఉన్న కేసులను కూడ రద్దు చేసుకొన్నారని ఆయన గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు, కోడెల శివప్రసాదరావు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ లాంటి నేతలపై కేసులను ఉపసంహరించారన్నారు.
వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఎలా వేధించాలో చంద్రబాబుకు బాగా తెలుసునని చెప్పారు. అంతేకాదు వ్యవస్థలను మేనేజ్ చేయడం కూడ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ కూడ తెలియదని ఆయన అభిప్రాయపడ్డారు.
పదే పదే కేసులు వేస్తూ ప్రభుత్వ పనితీరుకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానెల్స్ విష ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎల్లో మీడియా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పథకం ప్రకారం పనిచేస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.