చంద్రబాబుకు భవిష్యత్తు కళ్ల ముందు కన్పిస్తుంది: సజ్జల
తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.భవిష్యత్తు కళ్ల ముందు కన్పించినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు.
అమరావతి:చంద్రబాబుకు భవిష్యత్తు కళ్లముందు కన్పిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.ఇవాళో, రేపో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బుధవారంనాడు అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు పాపం పండిందన్నారు. అడ్డంగా బుక్ అయినట్టుగా ఆయనకు అర్థమైందన్నారు. చట్టాలకు చంద్రబాబు అతీతుడు కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పటికే ఈడీ వంటి ఏజెన్సీలను రంగంలోకి దిగి ఉండాల్సిందన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం విచారణ తుది దశలో ఉందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఐడీ విచారణ నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నాలుగున్నర ఏళ్లుగా వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇవాళ అనంతపురంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. గతంలో వైఎస్ఆర్ హయంలో తనపై 26 విచారణలు వేసినా కూడ ఏమీ చేయలేకపోయారన్నారు. తాను నిప్పు అని ఆయన చెప్పారు. ఎలాంటి సాక్ష్యాలు లేనందునే ఏ కేసులో తనను ఏం చేయలేదన్నారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి ఐటీ షోకాజ్ నోటీసు జారీ చేసిందని హిందూస్థాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది.ఈ కథనంపై వైసీపీ చంద్రబాబుపై విమర్శలు చేస్తుంది. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు కమీషన్లు తీసుకున్నాడని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. చంద్రబాబు హయంలో అవినీతి జరిగిందని తమ ఆరోపణలకు ఊతమిచ్చేలా ఐటీ నోటీసు ఉందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై చంద్రబాబు గతంలో స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
also read:నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది: చంద్రబాబు సంచలనం
అయితే అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.ఈ వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.