అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి గవర్నర్ కార్యాలయం షాక్ ఇచ్ిచంది. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియమాకం ఫైల్ ను గవర్నర్ కార్యాలయం వెనక్కి పంపించింది. 

శ్రీవెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, ద్రవిడ, ఆచార్య నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియమాకం ఫైల్ ను ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నరుకు పంపించింది. ఆ ఫైల్ ను గవర్నర్ 20 రోజుల పాటు పెండింగులో పెట్టారు. కార్యాలయం, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి పంపించారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ ప్రభుత్వం ఆ ఫైల్ ను పంపినట్లు తెలుస్తోంది.

నిరుడు డిసెంబర్ 16వ తేదీన రాష్ట్ర ప్రబుత్వం విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. సెర్చ్ కమిటీ అక్షర క్రమంలో ముగ్గురు వ్యక్తులతో ఓ ప్యానెల్ ను ప్రభుత్వానికి సమర్పిస్తుందని, ప్రభుత్వ సిఫార్సుపై ఆ ప్యానెల్ నుంచి ఒకరిని వైస్ చాన్సలర్ గా చాన్సలర్ నియమించాలని సవరణ తీసుకుని వచ్చింది. 

వాస్తవానికి వైస్ చాన్సలర్ నియమాకంలో యూజీసి నిబంధనల ప్రకారం ప్రభుత్వం పాత్ర ఉండదు. సెర్చ్ కమిటీ సూచించిన 3 పేర్ల నుంచి ఒకరిని వైస్ చాన్సలర్ గా చాన్సలర్ హోదాలో గవర్నర్ నియమిస్తారు. అయితే, తాము సూచించిన వ్యక్తిని వైస్ చాన్సలర్ గా గవర్నర్ నియమించే విధంగా ప్రభుత్వం చట్టానికి సవరణ చేసింది. 

వైస్ చాన్సల్ల నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని నివారించేందుకు యూజీసి 2010లో పలు మార్పులు తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణను సవాల్ చేస్తూ గత ఆగస్టులో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ తుది తీర్పునకు లోబడి నియమాకాలు చేయాలని కోరటు ఆదేశాలు జారీ చేసింది.