Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ తో పొత్తుకోసం మీరు పాకులాడొచ్చు, మేం భవనాలు ఇస్తే తప్పా?: చంద్రబాబుపై బుగ్గన ఫైర్

పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి ఓటుకు కోట్లు కేసులో వీడియోలకు అడ్డంగా దొరికిపోవడంతో అమరావతికి పారిపోయి వచ్చిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు.  

ap finance minister buggana rajendranathreddy slams tdp president chandrababu naidu
Author
Amaravathi, First Published Jul 25, 2019, 12:26 PM IST

అమరావతి: రాష్ట్ర విభజన, విభజన చట్టంలోని అంశాలపై ఏపీ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. ఏపీ భవనాలను తెలంగాణకు ఎలా ఇచ్చేస్తారంటూ టీడీపీ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాపకం కోసమే జగన్ ఏపీ భవనాలను తెలంగాణకు ఇచ్చేశారంటూ టీడీపీ ఆరోపించింది. దీంతో అధికార పార్టీ తరపున ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 

తెలంగాణకు ఏపీ ఆస్తులేవీ ఇవ్వలేదని కేవలం భవనాలను మాత్రమే ఇచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ఏపీ సీఎం జగన్, కేబినెట్ లోని మంత్రులతోపాటు అధికారులు వెళ్లి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. 

 ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే ఏపీ సీఎం, ముఖ్యమైన కేబినెట్‌ మంత్రులు, అధికారులు వెళ్లి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన సమస్యలపై చర్చించారని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని భవనాలు 2024 వరకు మనకు చెందుతాయని, ఆ తర్వాత అవి తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు.

అంతేకాదు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి ఓటుకు కోట్లు కేసులో వీడియోలకు అడ్డంగా దొరికిపోవడంతో అమరావతికి పారిపోయి వచ్చిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు.  

చంద్రబాబు నాయుడుతోపాటు హుటాహుటిన ప్రభుత్వ ఉద్యోగులు రావడంతో భార్యలు అక్కడ, భర్తలు ఇక్కడ.. పిల్లలు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి తయారైందని, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. 

అప్పుడు హుటాహుటిన పారిపోయి వచ్చి ఇప్పుడు భవనాలు వదిలేసి వచ్చామని అనడం సరికాదంటూ హితవు పలికారు. ఏపీ భవనాలు కావాలంటే నాలుగేళ్లపాటు మున్సిపల్‌ బిల్లులు, కరెంటు, వాటర్‌ బిల్లులు కట్టాల్సి ఉంటుందని, గత ఐదేళ్లూ వాడని భవనాలను తిరిగి అక్కడికి వెళ్లి ఇంకో ఐదేళ్లు వాడే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. 

ఎట్టిపరిస్థితుల్లో 2024లో ఆ భవనాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాల్సినవేనని అందులో ఎలాంటి సందేహం లేదు కనుకనే ఇచ్చేశామని చెప్పుకొచ్చారు. నీళ్లు, నిధుల పంపకాల వంటి పెద్ద పెద్ద విషయాల్లో సామరస్యంగా పంపకాలు చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఇటీవల జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తొమ్మిదో, పదో షెడ్యూల్‌లోని అంశాలు, నీళ్లు, నిధులు పంపకాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్ధమని చంద్రబాబు బాహాటంగా చెప్పినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి, కృష్ణ, గోదావరి నీళ్లు తెచ్చుకోవడానికి విశాల దృక్పథంతో ఆలోచిస్తే తప్పేంటని ప్రశ్నించారు. 

రెండు తెలుగు రాష్ట్రాల సఖ్యతతో ఉండి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగు కోసం చర్యలు తీసుకుంటే దానిని అభినందిచాల్సిందిపోయి విమర్శలు చేస్తారా అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. 

దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ టీడీపీ స్పీకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను తిట్టేందుకే వైసీపీ సభ్యులకు మైకు ఇస్తున్నారని ప్రజల సమస్యలపై ప్రశ్నించాలనుకుంటే మైక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సభను వాకౌట్ చేసింది టీడీపీ. 

Follow Us:
Download App:
  • android
  • ios