పెట్టుబడుల అంశంపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. టీడీపీ హయాంలో ఎన్నో ఎంఓయూలు జరిగాయని చెప్పారని.. వాటిలో ఏ ఒక్కటి శిలాఫలకం దాకా వెళ్లలేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు కౌంటరిచ్చారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు గాను తాను అధికారంలో వచ్చిన నాటి నుంచి వివిధ దేశాల్లో తిరిగానన్నారు. పెట్టుబడులకు అనువైన విధానాన్ని రూపొందించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌వన్‌గా ఏపీని నిలబెట్టామన్నారు.

39,450 చిన్నతరహా పరిశ్రమలు, 5,13, 531 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. రూ. 16 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తికనబరిచాయని చంద్రబాబు గుర్తు చేశారు.

ఉదయం 7 గంటలకు బయల్దేరితే రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చేవాడినని ఆవేదన వ్యక్తం చేశారు. నార్త్ కొరియా నుంచి కియా మోటార్స్ వచ్చిందని.. ఇప్పుడు అనంతపురంలో దక్షిణ కొరియా టౌన్‌షిప్ ఏర్పడటానికి రాత్రింబవళ్లు కష్టపడ్డానని ప్రతిపక్షనేత తెలిపారు.

ఇవి జరగలేదని చెబుతున్నవారు వీలైతే నిరూపించాలని.. బురద జల్లడం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబులా తిరగలేదని.. చివరికి కంప్యూటర్ కూడా మేమే కనిపెట్టామనే రేంజ్‌కు టీడీపీ నేతలు వెళ్లారని ఆయన సెటైర్లు వేశారు.

కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు గొప్పేమి లేదని.. ఆనాడు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారమే తాము అనంతలో ప్లాంట్ పెట్టామని కియో మోటార్స్ సీఈవో రాసిన లేఖను బుగ్గన ఈ సందర్భంగా సభలో చదివి వినిపించారు.